ట్రై పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. ట్రై కమిషనరేట్ల పునర్విభజన, ప్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటుతో వేలాది మంది సిబ్బంది గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సిబ్బంది పదోన్నతులు విషయంలో ఇప్పటికే తాత్సారం జరుగుతుండగా, కొత్తగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సిబ్బందిలో మరింత ఆందోళన మొదలైంది.
సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): జోనల్ విధానంలో మార్పులు చోటు జరుగుతుంటంతో ట్రై కమిషనరేట్‌తో పాటు ప్యూచర్ సిటీలోని సుమారు 10 వేల మంది సిబ్బందికిపైగా పదోన్నతుల్లో వెనుకపడే అవకాశాలున్నాయంటూ భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ 6వ జోన్లో, రాచకొండ 5వ జోన్లో ఉండడంతో ఏఎస్ఐ నుంచి కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది పదోన్నతల విషయం ఆగమ్య గోచరంగా మారిందంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్ణీత సమయానికి రావాల్సిన పదోన్నతులు రాక కొందరు కానిస్టేబుల్ స్థాయిలోనే రిటైర్ అవుతున్నారు.
‘ప్యూచర్’ లేని సిటీ..
ప్యూచర్ లేని ప్యూచర్ సిటీ కమిషనరేట్‌లో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని పోలీస్స్టేషన్లను తొలగించి కొత్త కమిషనరేట్‌కు కలిపారు. ఇప్పుడు ప్యూచర్ సిటీ కమిషనరేట్ ఏ జోన్ పరిధికి వస్తుందనేది సిబ్బందిలో సందిగ్ధత నెలకొంది. దీంతో పాటు రాచకొండలోని కొన్ని పోలీస్స్టేషన్లను హైదరాబాద్‌లోకి కలిపారు. హైదరాబాద్‌లో నుంచి కొన్ని రాచకొండ(మల్కాజిగిరి) కమిషనరేట్లోకి కలిపారు. సైబరాబాద్‌లో నుంచి కూడా హైదరాబాద్, రాచకొండలోకి కలిపారు. పదోన్నతుల క్యూలో ఉన్న వారు తమకు ఫలాన సమయానికి పదోన్నతి వస్తుందనే ఆశలో ఉన్నారు. ఇప్పుడు ఈ పునర్విభజనతో తమ నంబర్ ఎక్కడకు వెళ్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇలా వేలాది మంది సిబ్బంది జోన్ల మార్పు, పదోన్నతుల విషయంలో భయాందోళనలు ఎదుర్కొంటున్నారు.
సిబ్బందికి స్పష్టత ఇవ్వకుండా!
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉండే యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా మారింది. అలాగే రాచకొండలోని మహేశ్వరం జోన్లో ఔటర్ లోపల ఉన్న పోలీస్స్టేషన్లు హైదరాబాద్‌లో కలిశాయి. హైదరాబాద్‌లోని నార్త్‌జోన్‌లో ఉన్న పోలీస్స్టేషన్లు మల్కాజిగిరి కమిషనరేట్‌లో కలిశాయి. ఇలా పునర్విభజనలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. కమిషనర్లను నియమించిన తరువాత ఫలాన ప్రాంతాలు ఆయా కమిషనరేట్ల పరిధిలోకి వస్తాయంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి సిబ్బంది కష్టనష్టాలు, ప్రజలకు పోలీస్ ఉన్నతాధికారుల అందుబాటుకు సంబంధించిన అంశాల గూర్చి క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండానే హడావుడిగా ఏసీ గదుల్లో కూర్చొని పోలీస్ కమిషనరేట్ల పునర్విభజన చేశారంటూ ఉన్నతాధికారుల తీరుపై పోలీసు సిబ్బందే పరోక్షంగా మండిపడుతున్నారు.