సిటీబ్యూరో, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ స్వరూపం మారిపోయింది. గతం కన్నా ఎక్కువ పరిధికి సిటీ పోలీసింగ్ విస్తరించింది. జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరించిన నేపథ్యంలో పోలీసింగ్‌కు అనుకూలంగా ఉండేలా హైదరాబాద్‌లో నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేస్తూ హోం సెక్రటరీ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంతకుముందున్న హైదరాబాద్, సైబరాబాద్ పేర్లు అలాగే ఉంచి రాచకొండ పేరును మల్కాజిగిరిగా మార్చి, ప్యూచర్‌సిటీ పేరుతో కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్లు , వాటి పరిధి, అందులోకి వచ్చే జోన్లు, డివిజన్లు, పోలీస్స్టేషన్ల వివరాలను ఈ నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో ఉన్న జోన్ల పేర్లను మార్చారు. ఇంతకుముందు సీవీ ఆనంద్ హయాంలో సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఈమేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ స్వరూపం పూర్తిగా మారిపోయి అతిపెద్ద పోలీస్ కమిషనరేట్‌గా రూపొందింది. ప్రస్తుతం ఉన్న సీపీ సజ్జనార్ మరోసారి అధికారికంగా కొత్త కమిషనరేట్‌కు సిపిగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పీఎస్‌ల పరిధి పెంచడంతో పాటు మరికొన్ని ప్రాంతాలను ఆయా పీఎస్‌ల పరిధి నుంచి తొలగించి మరో కమిషనరేట్‌కు కలిపారు. ఇదంతా పోలీసింగ్ సక్రమంగా జరగడానికేనంటూ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
శంషాబాద్ వరకు సిటీ కమిషనరేట్..!
కొత్తగా చేర్చిన ప్రాంతాలతో సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధి శంషాబాద్ వరకు పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7 జోన్లు, 26 డివిజన్లు, 72 పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేశారు. గతంలో హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లోని నార్త్‌జోన్‌లో ఉన్న బేగంపేట, గోపాలపురం, బోయిన్పల్లి, తుకారాంగేట్, మారేడ్‌పల్లి, బొల్లారం, తిరుమలగిరి, కార్ఖానా పిఎస్..మొత్తం 8 పోలీస్ స్టేషన్లను మల్కాజిగిరి కమిషనరేట్‌లో కలుపుతూ హోం సెక్రటరీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సిటీ కమిషనరేట్లోకి సైబరాబాద్ కమిషనరేట్‌నుంచి 5 పీఎస్‌లు, పాత రాచకొండ ప్రస్తుత మల్కాజిగిరి కమిషనరేట్ నుంచి 4 పీఎస్‌లు చేర్చారు.
పాత జోన్ల స్థానంలో కొన్ని మార్పులు చేసి కొత్తగా ఏడు జోన్లను,చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్1,2, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ పేర్లతో ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ ప్రకారం సౌత్‌జోన్, సౌత్ఈస్ట్ జోన్లను కలిపి చార్మినార్ జోన్‌గా చేసి అందులో 15 పీఎస్‌లు, ఇప్పటివరకు సౌత్‌వెస్ట్ మొత్తం పీఎస్‌లతో పాటు సెంట్రల్, వెస్ట్, ఈస్ట్జోన్లలో ఒక్కొక్క పీఎస్‌లు కలిపి గోల్కొండ జోన్‌గా 14 పోలీస్స్టేషన్లు, వెస్ట్‌జోన్‌లోని కొన్ని పిఎస్లతోపాటు సైబరాబాద్‌లోని సనత్‌నగర్ పీఎస్ కలిపి ఖైరతాబాద్ 1 జోన్‌గా 7 పోలీస్స్టేషన్లు, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లు కలిపి 8 పీఎస్‌లతో ఖైరతాబాద్ 2 జోన్, హైదరాబాద్ కమిషనరేట్‌లోని సౌత్ఈస్ట్, సౌత్ జోన్లతో పాటు రాజేంద్రనగర్ జోన్‌లోని పీఎస్‌లు కలిపి మొత్తం 10 పీఎస్‌లతో రాజేంద్రనగర్ జోన్‌ను ఏర్పాటు చేశారు.
14 పీఎస్‌లతో కొత్తగా..
సెంట్రల్ ఈస్ట్, నార్త్జోన్లలోని 14 పీఎస్‌లతో కొత్తగా సికింద్రాబాద్ జోన్ ఏర్పాటు చేయగా,రాచకొండలో నాలుగు, సైబరాబాద్‌లో ఒక పీఎస్ కలిపి ఐదు పీఎస్‌లతో శంషాబాద్ జోన్‌ను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. మీర్‌పేట పీఎస్‌లో భాగంగా ఉన్న బడంగ్‌పేట ప్రాంతాన్ని ఒక కొత్త పిఎస్‌గా రూపొందిస్తూ బడంగ్‌పేట పేరుతో కొత్త పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పటేల్‌నగర్ వార్డును అంబర్‌పేట పీఎస్‌లో, తుకారాంగేట్ పీఎస్ పరిధిలో ఉన్న అడ్డగుట్ట, లాలాపేట వార్డును లాలాగూడ పీఎస్‌లో కలపగా,ఎర్రగడ్డ, బీకే గూడ, సనత్‌నగర్ ప్రాంతాలను సనత్‌నగర్ పీఎస్‌లో , బేగంపేట వార్డు నుంచి ఎయిర్పోర్ట్ కంటోన్మెంట్ వరకు పంజాగుట్ట పీఎస్‌లో , గోపాలపురం పీఎస్ పరిధిలోని మెట్టుగూడ వార్డును చిలకలగూడ పీకు కలిపారు. ఓయూ పీఎస్ లిమిట్స్‌లో ఉన్న హబ్సిగూడ ఏరియాను ఓయూనుంచి తొలగించారు.