హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావడానికి స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి దీపావళి పండుగ జరుపుకోవాలని తమిళిసై ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపాల పండుగ చెడుపై మంచి విజయానికి చిహ్నమని అభివర్ణించారు. దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ఆమె కోరారు.
వెలుగులు నింపే పండుగ
చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగగా దేశ ప్రజలు దీపావళిని జరుపుకొంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని ప్రార్థించారు. మరోవైపు, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌అలీ, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ తదితరులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.