హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. చాన్సలర్ హోదాలో తన తక్షణ జోక్యం అవసరమైన అంశాలపై నివేదిక సమర్పించాలని సూచించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని గవర్నర్ లోక్‌భవన్‌కు పిలిపించుకుని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వర్సిటీలవారిగా విద్య, పాలన, మౌలిక వసతుల కల్పన, ప్రొఫెసర్ల నియామకాలు, పరీక్షల నిర్వహణ, అక్రెడిటేషన్, పరిశోధన, ఆర్థిక అంశాలపై విశ్వవిద్యాలయాలవారిగా సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : యూనిఫామ్ పోస్టుల గరిష్ఠ వయోపరిమితిని సర్కార్ సడలించింది. జీవో-87ను జారీ చేస్తూ ఐదేండ్ల సడలింపు ఇచ్చింది. ఈ సడలింపు ఏడాదిపాటు అమల్లో ఉంటుందని సర్కార్ వెల్లడించింది. దీంతో జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు 39 ఏండ్ల వరకు ఈ పోస్టులకు పోటీపడొచ్చు. రిజర్వుడు క్యాటగిరీవారికి ఆయా సడలింపులతోపాటు, ఈ ఐదేండ్లు కలిసొస్తుంది. పోలీస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, అటవీశాఖల్లోని యూనిఫామ్ పోస్టులకు ఈ ఐదేండ్ల సడలింపు వర్తిస్తుంది.