సరస్వతీ, లక్ష్మీ కటాక్షాల కోసం సంక్షేమ పథకాలు
మిషన్ భగీరథతో తీరిన మహిళల నీటి కష్టాలు
రూ.100 కోట్లతో ప్రభుత్వ మహిళా వర్సిటీ
మహిళా దినోత్సవంలో మంత్రి కే తారకరామారావు
సంగారెడ్డి, మార్చి 8 (నమస్తే తెలంగాణ): మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, సరస్వతీ, లక్ష్మీ కటాక్షాలు రెండూ ఉండాలన్న సంకల్పంతో మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో మహిళల కష్టాలపై కేసీఆర్ పాటలు రాసేవారని, ప్రస్తుతం తెలంగాణ.. మహిళా సంక్షేమంలో ముందంజలో ఉన్నట్టు చెప్పారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్యక్షతన జీఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన మహిళా దినోత్సవానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో పల్లెనిద్రకు వెళ్లిన కేసీఆర్‌ను ఓ పెద్దాయన కలిసి తన బిడ్డ పెండ్లి కోసం దాచిన డబ్బు దగ్ధమైందని ఆవేదనగా చెప్పారని, ఆ పెద్దాయనకు నాడు అండగా నిలిచిన కేసీఆర్, తదనంతరం తెలంగాణ సీఎం హోదాలో ఆడబిడ్డల పెండ్లిళ్లకు అండగా ఉండాలని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టినట్టు గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు ప్రభుత్వ విద్య, వైద్యంపై నమ్మకం పెరిగిందని, కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసూతి కేసులు 30 నుంచి 56 శాతం పెరిగినట్టు వివరించారు. ఇప్పటివరకు 11 లక్షల కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.
పెరిగిన మైనారిటీ బాలికల విద్య
గురుకుల పాఠశాలల ఏర్పాటుతో మైనారిటీ బాలికలు ఎక్కువగా చదువుకొంటున్నారని కేటీఆర్ చెప్పారు. చదవుకొనే మైనారిటీ బాలికలు 20 నుంచి 42 శాతానికి పెరిగారని గుర్తుచేశారు. 973 గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని, ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. స్వరాష్ట్రంలో మహిళలకు తాగునీటి కష్టాలు తీరాయని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతున్నట్టు చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను తరిమివేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడంతోపాటు వారికి అండగా నిలిచేందుకు వీ-హబ్ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. 33 జిల్లాల్లో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఉండేలా చూస్తున్నామని, ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.2 నుంచి రూ.5 లక్షలకు పెంచినట్టు చెప్పారు. కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు వివరించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నట్టు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మహిళల కోసం రూ.100 కోట్లతో ప్రభుత్వం ప్రత్యేక మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో మూడురోజులపాటు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు రోజాబాల్రెడ్డి, పాండురంగారెడ్డి, లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్‌రెడ్డి, పుష్పానగేశ్, మెట్టుకుమార్‌యాదవ్, కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలుచేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పేదింటి ఆడ బిడ్డలకు మేనమామగా అండగా నిలిచారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లు ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చారు. కేసీఆర్ కిట్ అమలుతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసూతి కేసులు 30 నుంచి 56 శాతం పెరిగాయి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పారిశ్రామికపార్కులతోపాటు వారికి అండగా నిలిచేందుకు వీ-హబ్ ప్రారంభించాం.
–మంత్రి కే తారకరామారావు