Sanchar Saathi : కొత్తగా తయారయ్యే మొబైల్ ఫోన్లలో ‘సంచార్ సాథీ (Sanchar Saathi)’ యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేయడం తప్పనిసరేం కాదని కేంద్ర ప్రభుత్వం (Union Govt) తెలిపింది. యాప్ను తప్పనిసరి చేస్తూ గతంలో జారీచేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం భారత టెలికామ్ విభాగం (Telecom department) ప్రకటించింది.
సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం కొత్తగా వచ్చే మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే చర్య అని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఎవరితో సంప్రదించకుండా నియంతృత్వంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి.
ప్రభుత్వ ఆదేశాల తర్వాత స్వచ్ఛందంగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య పదింతలు పెరిగిందని, తమ లక్ష్యం కూడా ఇదేనని కేంద్రం తాజా ప్రకటనలో పేర్కొన్నది. సంచార్ సాథీ యాప్ యూజర్లు వేగంగా పెరుగుతున్నారని, తప్పనిసరి చేయడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనని తెలిపింది. యాప్ తప్పనిసరి అని ఆదేశాలు ఇవ్వడం ద్వారా దీని గురించి తెలియని వాళ్లకు అవగాహన కల్పించాలి భావించామని వెల్లడించారు.
గడిచిన ఒక్కరోజులో ఆరు లక్షల మంది యాప్లో రిజిస్టర్ చేసుకున్నారని, ఇది దాదాపు పదింతల పెరుగుదల అని కేంద్రం తెలిపింది. సంచార్ సాథీకి ఆదరణ పెరిగిన నేపథ్యంలో ముందస్తు ఇన్స్టలేషన్ను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించిందని టెలికామ్ విభాగం తన ప్రకటనలో పేర్కొన్నది.