Raviryal | రంగారెడ్డి, జూన్ 11 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో గల సర్వేనెంబర్ 289లోని సుమారు వంద ఎకరాలపై ప్రభుత్వ కన్ను పడింది. ఈ భూమి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతిసమీపంలో ఉండటం వలన ఈ భూమి హాట్‌కేక్‌లా మారింది. దీంతో ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంతో ఈ భూమిని ప్రభుత్వం హౌసింగ్ బోర్డుకు ఇచ్చిందని.. ఈ భూమి ప్రభుత్వానికే వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు రెవెన్యూ, పోలీసు, హౌసింగ్ బోర్డు, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో బుధవారం నాడు భూమిని స్వాధీనం చేసుకుని పెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించారు.
బుధవారం ఉదయమే ఈ భూమి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బుల్డోజర్లు రంగంలోకి దిగి భూమిని చదును చేసి పెన్సింగ్ వేయడానికి అధికారులు ముందుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రావిర్యాల గ్రామ రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఈ భూములు ఎన్నో ఏళ్లుగా తాము సాగుచేసుకుంటున్నామని, మా భూములను ఎలా తీసుకుంటారని రావిర్యాల గ్రామానికి చెందిన బాధిత రైతులు జేసీబీలకు అడ్డంగా కూర్చున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు అదనపు బలగాలు రంగంలోకి దిగి రైతులను బలవంతంగా పక్కకు నెట్టేసి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి రైతులకు అండగా అక్కడకు చేరుకున్నారు. ఈ విషయమై ఆమె వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి.. ఎన్నో ఏళ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న భూమిని ఎలాంటి నోటీసులివ్వకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే రైతుల పక్షాన రావిర్యాల భూమిలో బైఠాయిస్తానని ఆమె హెచ్చరించారు.
సర్వేనెంబర్ల మధ్య వివాదం..
రావిర్యాల గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 289లో సుమారు 400ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. ఈ భూమిలో వంద ఎకరాలను ప్రభుత్వం హౌసింగ్‌బోర్డుకు అప్పగించినట్లు చెబుతోంది. కాని, సర్వేనెంబర్ 73లో గల 53ఎకరాల భూమిని రావిర్యాల గ్రామానికి చెందిన సుమారు అరవైమంది రైతులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారు. ఆ సర్వేనెంబర్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు పక్కనే ఉందని, అప్పటి అధికారులు చూపించి అక్కడే రైతులకు పట్టాలిచ్చారు. ఆ భూమిని రైతులంతా సాగుచేసుకుని జీవిస్తున్నారు. ఇటీవల గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు భూసేకరణ కోసం ప్రభుత్వం ఈ రైతులకే నోటీసులు కూడా పంపించింది. 73 సర్వే నెంబర్లో గల భూమిని రైతులు సాగుచేసుకుంటున్నారని, రైతులు సాగుచేసుకుంటున్న భూమి 289 సర్వేనెంబర్ పరిధిలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. 73సర్వేనెంబర్ ఎక్కడ వస్తుందో చూపించాలని రైతులు పట్టుబట్టారు. అయితే 73సర్వేనెంబర్ లేనే లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కాని, 73సర్వేనెంబర్లో కాస్తుకాలంలో రైతుల పేర్లు వస్తుండటంతో పాటు ట్యాక్స్‌లను కూడా చెల్లించారు. గతంలో ప్రభుత్వం పట్టాలిచ్చినప్పుడు 73సర్వేనెంబర్ ఎక్కడుందో చూపించారని, కొత్తగా ప్రభుత్వం 73సర్వేనెంబర్ లేదని ఈ భూములు 289సర్వేనెంబర్ పరిధిలోకి వస్తాయని అధికారులు వాదిస్తున్నారు. దీంతో ఈ వివాదం రోజంతా సాగింది. ఈ భూమి 289 సర్వేనెంబర్ పరిధిలోకి వస్తే 73సర్వేనెంబర్ ఎక్కడుందో చూపించాలని రైతులు పట్టుబట్టారు. ప్రభుత్వం పేదలు సాగుచేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కోవాలని చూడటం సమంజసం కాదని రైతులు వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుల భూములను వదిలేసి మిగతా భూములను తీసుకోవాలని కోరుతున్నారు.
రైతులకు న్యాయం జరుగకపోతే ఇక్కడే బైఠాయిస్తా : సబితాఇంద్రారెడ్డి
మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో గల ప్రభుత్వ భూమి ఎన్నో ఏళ్లుగా రైతులు సాగుచేసుకుంటున్నారని, ఆ భూములను ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటే సహించేది లేదని, రైతులకు న్యాయం జరుగకపోతే రైతుల పక్షాన ఈ భూముల వద్దే బైఠాయిస్తామని హెచ్చరించారు. రావిర్యాల గ్రామంలోని సర్వేనెంబర్ 73లో గ్రామానికి చెందిన రైతులు సుమారు 60మంది నిజాం కాలం నుంచి ఈ భూములను సాగుచేసుకుంటున్నారని తెలిపారు. ఈ భూములు రైతులే సాగుచేసుకుంటున్నట్లు పహాణీ రికార్డులో కూడా ఉందని, అలాగే, పన్నులు కూడా చెల్లించినట్లు రశీదులు ఉన్నాయని అన్నారు. ఈ భూములు తమకే వర్తిస్తాయని రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నారని, ఆ భూములు సర్వేనెంబర్ 289లోకి వస్తాయని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించటం సమంజసం కాదని పేర్కొన్నారు. రైతులు ఈ భూములను నమ్ముకుని జీవిస్తున్నారని వెంటనే ఆ భూములను రైతులకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆమె జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వెంటనే పనులను నిలిపివేయాలని కోరారు.