మేడ్చల్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నాణ్యమైన విద్యతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకూ చర్యలు తీసుకుంటున్నది. సమస్యలు లేని పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సంకల్పించి ఈ మేరకు ప్రణాళికలను రూపొందించి త్వరలోనే వాటిని అమలు చేయనున్నది.
మరీముఖ్యంగా మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.16 కోట్లను మంజూరు చేసింది. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలలో 505 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు (375), ప్రాథమికోన్నత పాఠశాలలు (22), ఉన్నత పాఠశాలల (108)లో 94,965 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సీడీఎఫ్ నుంచి మంజూరైన నిధులతో పాఠశాలల అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
మౌలిక వసతుల కల్పన..
నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.16 కోట్లు విడుదల కాగా.. జిల్లావ్యాప్తంగా సమస్యలు ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాలలను గుర్తించిన అధికారులు అదనపు తరగతి గదులు, బాత్రూంలు, ప్రహరీలు, మంచినీటి సౌకర్యం, ఫర్నిచర్ లాంటి సౌకర్యాలు కల్పించనున్నారు.