నాగర్ కర్నూల్ : దాయాదుల మధ్య జరిగిన వివాదానికి రాజకీయ రంగు పూసి నాగర్ కర్నూల్ మాజీ జడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం ( Srisailam ) ను అక్రమంగా అరెస్ట్ ( Arrest ) చేసి రిమాండ్కు తరలించడంపై బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నేతల వ్యవహారాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులు ,కౌన్సిలర్ – తిమ్మాజిపేట పాండు, మాజీ ఎంపీటీసీ చీకొండ్ర నాగయ్య, రైతు బంధు మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, మోత్కూరి నాగార్జున , కట్ట వంశీ గౌడ్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లతో పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ద్వారా ప్రతిపక్ష గొంతును అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
మార్కెట్ చైర్మన్ రమణారావుకు సంబంధించిన వ్యవహారాలు, అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలని మాజీ జడ్పీటీసీ శ్రీశైలం ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం వెనుక రాజకీయ కోణం ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు.
అధికార పార్టీకి చెందిన వ్యక్తులు గొడ్డళ్లతో దాడులకు పాల్పడినా కేసులు నమోదు చేయకుం డా వదిలేస్తున్నారని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు మరో న్యాయం ఉండకూడదని డిమాండ్ చేశారు. శ్రీశైలంను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.