
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల్లో భార్యాభర్త ఒకేజిల్లాలో పనిచేసేందుకు ప్రభుత్వం వీలుకల్పించింది. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్పౌజ్ కోటాలో లోకల్ క్యాడర్ మార్చుకొనేందుకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదలచేశారు. ఈ కోటాలో బదలాయింపు కోరుకొనే ఉద్యోగి, తాజా కేటాయింపు ఉత్తర్వుల ప్రకారం ముందు కొత్త పోస్టులో చేరి, ఆ తర్వాతే స్పౌజ్కోటాలో క్యాడర్ మార్పునకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు నిర్దేశిత ఫార్మాట్‌ను సైతం విడుదల చేశారు. జిల్లా క్యాడర్ ఉద్యోగులు జిల్లా హెచ్‌వోడీకి, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులు సంబంధితశాఖల హెచ్వోడీలకు దరఖాస్తు చేసుకోవాలి. వీరు ఆ దరఖాస్తులను క్రోడీకరించి తగిన సిఫారసులతో కార్యదర్శులకు పంపించాలి. వీటిని సంబంధితశాఖ సెక్రటరీలు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని మార్గదర్శకాల్లో సూచించారు.
అప్పీళ్లకు అవకాశం
కొత్త జిల్లాలు, జోనల్ విధానానికి అనుగుణంగా చేసిన కేటాయింపులపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే వీరు కొత్త పోస్టింగుల్లో చేరాకే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందని సీఎస్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. జిల్లా క్యాడర్ ఉద్యోగులు జిల్లా హెచ్‌వోడీకి, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులు శాఖాధిపతులకు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్పీళ్లపై త్వరితగతిన విచారణ జరిపి పరిష్కరించాలని అన్నిశాఖల కార్యదర్శలను సీఎస్ ఆదేశించారు.