హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ) : ఏవో ఉద్యోగోన్నతుల్లో గ్రాడ్యుయేట్ ఏఈవోలకు 40% అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ జీవో 39 జారీ చేశారు. ఏఈవోలకు ఏవో ఉద్యోగోన్నతుల్లో ప్రతి 10 పోస్టుల్లో నాలుగు పోస్టులు బీఎస్సీ(అగ్రికల్చర్) చేసిన వారికి, 5 పోస్టులు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసిన వారికి, మరొక పోస్టు డిప్లొమా ఇన్ అగ్రి ఇంజినీరింగ్ చేసిన వారికి కేటాయించనున్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏఈవో నుంచి ఏవో ఉద్యోగోన్నతులకు సంబంధించిన అర్హతలను కూడా రూపొందించింది.
సాధారణంగా ఫీడర్ క్యాటగిరీలో కనీసం మూడేండ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగి ప్రమోషన్‌కు అర్హుడు. అయితే బీఎస్సీ(డ్రైల్యాండ్ అగ్రికల్చర్) అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రం కనీసం ఏడేండ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగోన్నతుల్లో 40% వాటా కల్పించిన ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్ ఏఈవో అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. సీఎం రేవంత్, మంత్రి తుమ్మల, ఏపీసీ సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపీకి సంఘం నేతలు సుమన్, నవీన్ కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆధ్యాత్మిక చైతన్యంతో అర్చకులు, గిరిజన అర్చకులు అందించిన సేవలు అభినందనీయమని, వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. బుధవారం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అర్చకుల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధూప,దీప, నైవేద్య భత్యం పెంపు, అర్చక పిల్లలకు ఉచిత వేద సాధారణ విద్య, నిరుపేద అర్చకులకు 250 గజాల నివాస స్థలం, డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా ఉచిత వైద్యం అందించాలని అర్చకులు వారికి వినతి పత్రం సమర్పించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని కమిటీ సభ్యులు కోదండరాం, మోతె శోభన్ రెడ్డి, ఎస్ రాములు పేర్కొన్నారు.