e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, December 7, 2021
Home News ధర్మం పక్షం నిలిచిన మనిషి మహోన్నతుడవుతాడు

ధర్మం పక్షం నిలిచిన మనిషి మహోన్నతుడవుతాడు

మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మంచికి దారితీస్తాయి. మరికొన్ని కష్టాల్లోకి తోస్తాయి. అంతిమ ఫలితం మంచే అయినా, అది ఆ నిర్ణయం తీసుకునే క్షణంలో తెలియకపోవచ్చు. తాత్కాలికంగా కలిగే కొన్ని ఆటుపోట్లు అంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టేలా చేయవచ్చు. కానీ, చెడుకు దారితీయవచ్చనే అనుమానంతో నిర్ణయం తీసుకోకుండా ఉండటం యోగ్యత అనిపించుకోదు. ధర్మం పక్షం నిలిచిన మనిషి మహోన్నతుడవుతాడు. శ్రీరాముడి జీవితంలో అడుగడుగునా ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తాయి.

సీతారాములు వనవాసం చేస్తున్న రోజులవి. పర్ణశాలలో ఇద్దరూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. లక్ష్మణుడు వారికి సేవలు చేస్తున్నాడు. చల్లని ప్రకృతి ఒడిలో కాలం తెలియకుండా గడిచిపోయింది. దాదాపు పదమూడేండ్లు గడిచిపోయాయి. మరో ఏడాది గడిచిపోతే, మళ్లీ అయోధ్యకు వెళ్లిపోవచ్చు. రాముడు పట్టాభిషిక్తుడు కావచ్చు. అలాగే జరిగి ఉంటే రామాయణం మరోలా ఉండేదేమో! ఓ రోజు రాముడు పర్ణశాల ఆరుబయట చెట్టుకింద కూర్చుని ఉన్నాడు. సీతమ్మ రామయ్యకు సపర్యలు చేస్తున్నది. లక్ష్మణుడు అల్లంత దూరంలో ఉన్నాడు. ఇంతలో కొందరు మునులు ఆశ్రమానికి వస్తారు. రామచంద్రుణ్ని దర్శించుకుంటారు. కుశల ప్రశ్నలు అడిగాడు రాముడు. అప్పుడు ఆ యోగులు నిర్లిప్తంగా ‘ఎక్కడి కుశలం రామా! రాక్షసుల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మా యజ్ఞయాగాది క్రతువులు సాగటం లేదు. తపస్సు చేసుకునే అవకాశమే లేకుండా పోతున్నది’ అని బావురుమంటారు.

- Advertisement -

శ్రీరాముడు వారిని అనునయిస్తూ, ‘రాక్షసులను అంతమొందించి మీ ఇబ్బందులను పరిష్కరిస్తాన’ని హామీ ఇస్తాడు రాముడు. వేగంగా కుటీరంలోకి వెళ్లి విల్లంబులు తీసుకుంటాడు. రాముడి ప్రతిజ్ఞ వింటూనే కలత చెందుతుంది సీతమ్మ. వడివడిగా రాముణ్ని సమీపిస్తుంది. ‘దాదాపు పదమూడేండ్లు గడిచిపోవస్తున్నది. ఇప్పుడు రాక్షసులతో వైరం వల్ల హాయిగా సాగిపోతున్న వనవాసం ఎటు దారితీస్తుందో!’ అంటూ భర్తను నిలువరించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు రాముడు ‘ప్రజల కష్టాలను తీర్చడం రాజు విధి. నేను ఈ వనాలకు రాజుగా ఉంటానని భరతుడితో చెప్పాను. ఈ అడవిలో మునులు నా సాయం అర్థించినప్పుడు రాజధర్మం ప్రకారం వారిని ఆదుకోవడం నా ధర్మం’ అంటాడు.

రాముడు తన నిర్ణయం మార్చుకోడని అర్థమవుతుంది సీతమ్మకు. అయినా చివరి ప్రయత్నంగా ‘రామా! ఇన్నాళ్లూ కందమూలాలు తింటూ, ప్రశాంతంగా జీవనం సాగించాం. ఇప్పుడు నువ్వు ఆయుధం పట్టుకున్నావు. ఈ ఆయుధం మనిషి ప్రవృత్తినే మార్చేస్తుంది. మనసును గతి తప్పేలా చేస్తుంది. దీనికి రుజువుగా ఒక కథ చెప్తాను. పూర్వం ఓ యతీశ్వరుడు కఠోర తపస్సు చేయసాగాడు. ఇంద్రుడు ఆ మునిని పరీక్షించాలనుకుంటాడు. వేటగాడి వేషం ధరించి ముని ఆశ్రమానికి వస్తాడు. మునిని దర్శించుకొని తన ఖడ్గాన్ని ఇస్తాడు. తిరుగు ప్రయాణంలో ఖడ్గం తీసుకుంటానని, అప్పటివరకు దీన్ని భద్రపరచమని చెప్పి వెళ్లిపోతాడు. ఖడ్గాన్ని ముని తన ఆసనం సమీపంలో భద్రపరుస్తాడు. రోజులు గడిచిపోతాయి. వేటగాడి జాడ ఉండదు. వాడకం లేకపోతే ఖడ్గం తుప్పు పట్టిపోతుందని భావిస్తాడు ముని. దానితో తనకు అవసరమైన దర్భలు, ఆకులు కోయడం వంటి పనులు చేయడం మొదలుపెడతాడు. ఇంకొన్ని రోజుల తర్వాత ఆశ్రమంలోకి చొరబడిన క్రూరమృగాలను వేటాడటం ప్రారంభించాడు. మరికొన్నాళ్లకు తన తపస్సును మరిచి పూర్తిగా వేటగాడిగా మారిపోతాడు’ అని చెప్పి రాక్షసులపై యుద్ధానికి వెళ్లొద్దంటుంది సీతమ్మ.

సీతమ్మ భయాన్ని గుర్తించిన రాముడు చిరునవ్వుతో ‘సీతా! ఏదో ఊహించుకొని కంగారుపడుతున్నావ్‌! నా ధర్మాన్ని నన్ను పాటించనివ్వు’ అని అడవిలోకి వెళ్లిపోతాడు. రామాయణాన్ని మలుపుతిప్పిన సందర్భం ఇది. మునుల రక్షణార్థం రాముడు జనస్థానంలో రాక్షసులతో భీకరయుద్ధం చేస్తాడు. ఖర, దూషణాది పధ్నాలుగు వేల మంది అసురులను సంహరిస్తాడు. ఈ విషయం చెవిన పడిన రావణుడు.. రాముడి గురించి వాకబు చేయడం, సీతమ్మను అపహరించడం ఇలా రామాయణ గమనమే మారిపోయింది. కానీ, ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అన్న కీర్తి మాత్రం యుగయుగాలుగా నిలిచే ఉంది.

టి.వి.ఫణీంద్రకుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement