హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : అర్హత గల మహిళా సంఘాలకు ఇప్పటివరకు అందిస్తున్న రూ. 5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు మంత్రి సీతక్క చెప్పారు. వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో గురువారం మహిళా స్వయం సహాయక బృందాల వార్షిక రుణ ప్రణాళిక 2026-27ను ఆమె ఆవిష్కరించారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.26,621.47 కోట్ల రుణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
భద్రాచలం, మే 7(నమస్తే తెలంగాణ) : ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఇద్దరు అటవీ శాఖ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో నూతనంగా రోడ్డు వేస్తున్న క్రమంలో అటవీ శాఖకు చెందిన కొన్ని చెట్లను కాంట్రాక్టర్ తొలగించాల్సి వచ్చింది. కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ అధికారి సుజాత, చర్ల ఇన్చార్జి డీఆర్వో కృష్ణయ్య రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. గురువారం కాంట్రాక్టర్ నుంచి సుజాత, కృష్ణయ్య రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో అధికారులు పట్టుకొని అరెస్ట్ చేశారు.