ప్రస్తుతం తెలుగులో మహేష్‌బాబు సరసన ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్నది గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా. మరోవైపు హాలీవుడ్ సినిమాలపై కూడా ఈ భామ దృష్టి పెడుతున్నది. ఇటీవలే ది బ్లఫ్, సిటాడెల్ సీజన్-2 వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ భామ హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు అంగీకరించింది.
‘రీసెట్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హాలీవుడ్ అగ్ర నటుడు ఓర్లాండోబ్లూమ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఫేమ్మాట్ దర్శకత్వంలో సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. విశేషమేమిటంటే..హీరో ఓర్లాండోబ్లూమ్తో కలిసి ప్రియాంక చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఓ దట్టమైన అరణ్యంలో చిక్కుకున్న మహిళను ఓ అపరిచితుడు ఎలా రక్షించాడన్నదే ఈ చిత్ర కథాంశమని, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చెబుతున్నారు. గతంతో తాను నటించిన ‘ది బ్లఫ్’ సినిమాను కూడా ప్రియాంకచోప్రానే ప్రొడ్యూస్ చేసింది. ఇలా హాలీవుడ్లో నటనతో పాటు నిర్మాతగా సత్తా చాటుతున్నదీ భామ.