మంగళూరు సోయగం పూజాహెగ్డేకు తెలుగులో మళ్లీ మంచి రోజులొచ్చాయి. గతకొంతకాలంగా ఇక్కడ భారీ హిట్‌కోసం ఎదురుచూస్తున్న ఈ భామ అందుకు తగినట్లుగానే ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఆమె దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌తో ఈ సొగసరి ముచ్చటగా మూడోసారి జోడీకట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం సైంటిఫిక్ ఫిక్షన్ ‘రాకా’లో నటిస్తున్నారు అల్లు అర్జున్. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా ఖరారయ్యే ఛాన్స్ ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇప్పటికే బన్నీ-పూజాహెగ్డే కలిసి ‘డీజే’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరికి హిట్‌పెయిర్‌గా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో మూడోసారి ఈ జంట జోడీ కట్టనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.