యాదాద్రి, మార్చి 17 : యాదాద్రి ప్రధానాలయం త్వరలో పునః ప్రారంభం కానున్న వేళ.. కొండపైన చేపడుతున్న పనులపై వైటీడీఏ, ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నెల 21 మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ చేపట్టనున్న సందర్భంగా అందుకు కావాల్సిన పనులు దాదాపు తుది దశకు చేరాయి. యాదాద్రీశుడి ప్రధానాలయ గర్భాలయ ముఖ మండపం బంగారు వర్ణంతో మెరిసిపోనున్నది. ఇందుకోసం ప్రధానాలయంలోని స్వామివారికి, ద్వార, ధర్వాజలు, ధ్వజస్తంభ, బలిపీఠంతోపాటు జయవిజయుల ద్వారాల మధ్యలో బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. ప్రధానాలయ ద్వారాన్ని 13 కిలోల బంగారంతో, ధ్వజస్తంభం, బలిపీఠాన్ని సుమారు 4 కిలోల బంగారు తాపడాలతో తీర్చిదిద్దారు. జయవిజయుల ద్వారాల మధ్య ప్రాంతంలో బంగారు తాపడం పనులు తుది దశకు చేరాయి. స్వయంభువులను దర్శించుకొనే భక్తులకు సకల వసతులతో క్యూ కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఆలయ రాజగోపురాలకు స్వర్ణ కలశ స్థాపన పనులు దాదాపు పూర్తయ్యాయి. ఒక్కో పంచతల రాజగోపురానికి 9 కలశాలు, సప్తతల రాజగోపురానికి 11 కలశాలను ప్రతిష్ఠించారు. స్వామివారి దివ్య విమానగోపురాన్ని బంగారు తాపడంతో తీర్చిదిద్దేందుకు అవసరమైన రాగి తొడుగుల పనులను తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన స్తపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో చేపట్టగా తుదిదశకు చేరాయి. కాలినడకన దర్శించుకొనే భక్తులకు కొండకింద గల స్వామివారి వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి మొత్తం 335 శ్రీవారి మెట్లను నిర్మిస్తుండగా 315 మెట్లు పూర్తి చేశారు. మిగతా 20 మెట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా బాలాలయంలో నిర్వహించనున్న పంచకుండాత్మక యాగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలాలయంలో 5 యాగశాలలను నిర్మిస్తున్నారు.