తిరుపతి : ఒంటిమిట్టలోని (Ontimitta) శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను ( Gold crowns) , పెన్నా సిమెంట్స్ అధినేత శ్రీ ప్రతాప్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో శుక్రవారం విరాళంగా అందించారు. దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు దాత అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ కిరీటాలను శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు.
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ..
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7.30 గంటలకు శివధనుర్భంగాలంకారంలో శ్రీ కోదండ రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది.
కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.