Gold Rates | అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు నెలకొనడంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా తగ్గాయి. గత నాలుగు నెలల్లో పది గ్రాముల (24 క్యారట్ల) బంగారం ధర రూ.5000 దిగొచ్చింది. మార్చి మధ్యలో పది గ్రాముల (24 క్యారట్ల) బంగారం ధర రూ.55,200లకు చేరుకుంది. తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో పుత్తడి ధర సోమవారం బులియన్ మార్కెట్ (ఫ్యూచర్స్)లో రూ.50,622కు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1725.17 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. ఇతర లోహాలు స్పాట్ వెండి ఔన్స్ ధర 18.58 డాలర్లు పలికితే, ప్లాటినం ధర 0.2 శాతం తగ్గి 871.43 డాలర్లకు, పల్లాదియం 1.5 శాతం పతనమై 2001.62 డాలర్లకు చేరుకున్నది.
ఇక ఇన్వెస్టర్లు బుధవారం ముగియనున్న అమెరికా ఫెడ్ రిజర్వ్ రెండు రోజుల ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలపై దృష్టి పెట్టారు. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం ధరలను కట్టడి చేయడానికి ఫెడ్ రిజర్వు.. కీలక వడ్డీరేట్లు 75 బేసిక్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రభావంతో గత మార్చి ప్రారంభంలో 2000 డాలర్లను తాకింది ఔన్స్ బంగారం. తదుపరి అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచడం, డాలర్ బలోపేతమైంది. దీంతో బంగారం ధర సర్దుబాటుకు గురై 250 డాలర్లకు పైగా (12 శాతం) తగ్గింది.