Gold | బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ హైలో గోల్డ్ రేట్లు కదలాడుతుండటం గమనార్హం. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు ఏకంగా రూ.78,450గా నమోదైంది. నిజానికి గతకొద్ది రోజులుగా పుత్తడి విలువ నిత్యం ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే చాలామందికి ముఖ్యంగా సగటు మధ్యతరగతి వర్గానికి పసిడి కొనుగోళ్లపై ఎటూ తేల్చుకోలేని సందిగ్ధతే ఏర్పడింది. కొందామా.. ఆగుదామా? అనేది తెలియక ఒకింత గందరగోళంలోనే కొనుగోలుదారులున్నారు. మరి.. గోల్డ్ మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల మాటేంటి?
పండుగ సీజన్లో పైపైకే..
ఈ పండుగ సీజన్లో ధరలు మరింత పెరిగేలానే ఉన్నాయని మెజారిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నవరాత్రులు, దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలున్న నేపథ్యంలో మార్కెట్లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పైగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లో ఎగబాకుతున్న ముడి చమురు ధరలు, దేశ-విదేశీ స్టాక్ మార్కెట్ల పతనం వంటివి ఇన్వెస్టర్లను సహజంగానే గోల్డ్‌వైపు తిప్పుతున్నాయి. బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా చూస్తుండటంతో ఇన్వెస్టర్ల నుంచి పెరిగే డిమాండ్ కూడా మార్కెట్లో ధరలను పరుగులు పెట్టిస్తుందని అంటున్నారు. దీంతో మరో 3-4 నెలలదాకా గోల్డ్ రేట్లు తగ్గకపోవచ్చనే అంచనాలే కనిపిస్తున్నాయి.
కరెక్షన్ ఎప్పుడు?
గోల్డ్ మార్కెట్లో కరెక్షన్ ఎప్పుడన్నదానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తకర వాతావరణం చల్లబడాలని, స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టాలని, అప్పుడే బంగారం ధరలు దిగివచ్చే వీలుందన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న ధరల్లో 5 నుంచి 7 శాతం మేర తగ్గవచ్చని చెప్తున్నారు. మొత్తానికి మదుపరులు తిరిగి తమ పెట్టుబడులను స్టాక్స్, బాండ్లవైపు మళ్లిస్తేనే గోల్డ్ రష్ తగ్గుతుందని అంటున్నారు. దీంతో ఇప్పట్లో బంగారం కొనుగోళ్ల జోలికి పెద్దగా వెళ్లకపోవడమే లాభదాయకమన్న రీతిలో నిపుణుల స్పందన ఉంటున్నది. అయితే స్వల్ప కాలానికి చూస్తే ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు కొని కొద్ది రోజుల తర్వాత అమ్ముకోవచ్చని కూడా సూచిస్తున్నారు. కానీ మార్కెట్ ట్రెండ్‌కు లోబడి రిస్క్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.