న్యూఢిల్లీ, నవంబర్ 26: బంగారం మళ్లీ భగ్గుమన్నది. స్టాక్ మార్కెట్లు భారీ పతనం చెందడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలకు మళ్లించడంతో వీటి ధరలు అధికమయ్యాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.570 పెరిగి రూ.47,150 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర అధికమవడంతోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనమవడం వల్లనే వీటి ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. బంగారంతోపాటు వెండి కూడా అధికమైంది. కిలో వెండి ధర రూ.190 పెరిగి రూ.62,140 వద్ద స్థిరపడింది. అటు హైదరాబాద్‌లోనూ పదిగ్రాముల పసిడి ధర రూ.170 పెరిగి రూ.48,930కి చేరుకోగా, వెండి కిలో ధర రూ.100 అందుకొని రూ.67,900 చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,808 డాలర్లకు చేరుకోగా, వెండి 23.07 డాలర్లు పలికింది.
తాజాగా సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. గ్రాము గోల్డ్ బాండ్ ధర రూ.4,791. ఈ బాండ్లను 29 నుంచి డిసెంబర్ 3 వరకు విక్రయించనున్నారు.