Gold Price | న్యూఢిల్లీ, నవంబర్ 4: రోజురోజుకూ పెరుగుతూ.. రికార్డులతో కదం తొక్కిన బంగారం, వెండి ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. సోమవారం దేశీయ మార్కెట్లో భారీగా పడిపోయాయి. ఈ ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి రేటు ఏకంగా రూ.1,300 తగ్గింది. దీంతో ఢిల్లీలో రూ.81,100 వద్ద స్థిరపడింది. గత గురువారం మునుపెన్నడూ లేనివిధంగా తులం పసిడి ధర ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.82,400 పలికిన విషయం తెలిసిందే. ఇక వెండి ధరలూ పెద్ద ఎత్తునే తగ్గుముఖం పట్టాయి. కిలో రూ.4,600 క్షీణించి రూ.95 వేల మార్కుకు దిగువన రూ.94,900 వద్ద నిలిచింది. కాగా, హైదరాబాద్ ధరల విషయానికొస్తే.. 24 క్యారెట్ తులం బంగారం రూ.80,400గా, 22 క్యారెట్ రూ.73,700గా ఉన్నాయి.
తగ్గిన డిమాండ్
స్టాక్హోల్డర్లు, రిటైలర్లు బంగారాన్ని ఒక్కసారిగా అమ్మడానికి ముందుకు రావడం, పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో మార్కెట్లో ధరలు భారీగా పతనమైపోయాయని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. పండుగలు అయిపోవడంతో స్థానిక మార్కెట్లలో జ్యుయెల్లర్స్ నుంచి డిమాండ్ కూడా లేదని పేర్కొన్నది. దసరా, ధనత్రయోదశి, దీపావళి దృష్ట్యా నగల వర్తకుల నుంచి పసిడికి విశేష ఆదరణ లభించింది. కాగా, మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో డిసెంబర్ నెల డెలివరీకిగాను గోల్డ్ కాంట్రాక్ట్స్ 10 గ్రాములు రూ.78,538 వద్ద ట్రేడ్ అయ్యాయి. గతంతో పోల్చితే రూ.329 పడిపోయింది. గత వారం ఫ్యూచర్స్ మార్కెట్లో ధర తొలిసారి రూ.79,775 పలికింది. సిల్వర్ కాంట్రాక్ట్స్ కిలో రూ.95,071గా ఉన్నది. మునుపటితో చూస్తే రేటు రూ.412 పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో..
భారతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొస్తున్నా.. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఔన్సు పుత్తడి 3.60 డాలర్లు ఎగిసి 2,752.80 డాలర్లుగా నమోదైంది. ఔన్సు వెండి కూడా 32.94 డాలర్లు పుంజుకున్నది. వచ్చే ఏడాది ఆఖరుకల్లా ఔన్సు గోల్డ్ విలువ 3,000 డాలర్లపైకి చేరుతుందన్న అంచనాలున్నాయి.
ఒడిదొడుకుల్లోనే..
బంగారం ధరలు రాబోయే రోజుల్లో తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యే వీలుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష నిర్ణయాలు, అగ్రరాజ్య స్థూల ఆర్థికాంశాలు.. గోల్డ్ మార్కెట్‌ను అధికంగా ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో దిద్దుబాటుకు అవకాశాలున్నాయని, ధరలు ఇంకా పడిపోవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.