హైదరాబాద్, ఫిబ్రవరి 12: గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి చేరుకోవడం, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కె ట్లో అత్యంత విలువైన లోహాల ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోవడంతో దేశీయంగా ధరలు పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,080 అధికమై రూ.51,050కి చేరుకున్నది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,800 పలికింది. అలాగే రూ.500 అధికమైన కిలో వెండి రూ.67,400 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో అత్యధికమవడానికి తోడు దేశీయంగా పెళ్లిళ్ళ సీజన్ కూడా తోడవడం ధరలు ఎగబాకడానికి కారణమని బులియన్ వర్తకులు వెల్లడించారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1.6 శాతం అధికమై 1,855.17 డాలర్లు పలికింది. నవంబర్ 19 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. భవిష్యత్తులో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.