న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు క్రూడాయిల్, డాలర్ మరింత బలోపేతం కావడం ధరలు దిగువముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,800 తగ్గి రూ.1.54 లక్షలకు దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1.56 లక్షలుగా ఉన్నది.
పసిడితోపాటు వెండి ధర రూ.6,500 లేదా 3 శాతం తగ్గి రూ.2.44 లక్షల దిగువకు పడిపోయింది. బంగారం ధరలు మూడు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 95.37 డాలర్లు లేదా 2 శాతం తగ్గి 4,586.50 డాలర్లకు పడిపోగా, వెండి 73 డాలర్లకు దిగొచ్చింది.