న్యూఢిల్లీ, మార్చి 30 : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఈ రెండు లోహాల ధరలు 3 శాతం వరకు ఎగబాకాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. కిలో వెండి ఏకంగా రూ.2.37 లక్షలకు చేరుకోగా, బంగారం రూ.1.51 లక్షలు అధిగమించింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి కిలో వెండి రూ.7 వేలు లేదా 3.04 శాతం అందుకొని రూ.2,37,000కు చేరుకున్నది. గత శుక్రవారం ఈ ధర రూ.2.30 లక్షలుగా ఉన్నది. అలాగే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.3,700 లేదా 2.5 శాతం అధికమై రూ.1,51,500 పలికింది.
అంతకుముందు ఇది రూ.1,47,800గా ఉన్నది. పెండ్లిళ్ల సీజన్ ప్రారంభంకావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు పసిడి కొనుగోళ్లు ఊపందుకున్నాయని, తద్వారా ధరలు భారీగా పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీస్ సౌమిల్ గాంధీ తెలిపారు. రూపాయి పతనం కూడా ధరలు పెరగడానికి పరోక్షంగా కారణమైందన్నారు. ఈ నెల 2 నుంచి ఇప్పటి వరకు బంగారం ధర రూ.21,300 లేదా 12.3 శాతం తగ్గగా, వెండి రూ.63 వేలు లేదా 21 శాతం చొప్పున పతనం చెందాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 38.68 డాలర్లు లేదా ఒక్క శాతం బలపడి 4,531.67 డాలర్లకు చేరుకోగా, వెండి 1.35 శాతం అందుకొని 70.72 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.