న్యూఢిల్లీ: దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని, మావోయిస్టు హింసాకాండకు నిలయమైన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ప్రకటించారు. దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం విధించిన మార్చి 31వ తేదీ గడువు సమీపిస్తున్న వేళ సోమవారం లోక్‌సభలో అమిత్ షా 90 నిమిషాలపాటు నక్సల్ విముక్త భారత్‌పై ప్రసంగించారు. బస్తర్ ఇప్పుడు అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని, ఈ ఘనత భద్రతా దళాలు, రాష్ట్ర పోలీసులు, స్థానిక గిరిజన సమాజానికే దక్కుతుందని ఆయన తెలిపారు.
‘దేశంలో నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఈ ప్రక్రియ మొత్తం అధికారికంగా పూర్తయిన తర్వాత దేశానికి తెలియజేస్తాం. అయితే మన దేశం నక్సల్స్ రహితంగా మారిందని చెప్పగలను’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను తిరస్కరించి ఆయుధాలు పట్టుకునే వారిని ఉపేక్షించబోమని, అటువంటి వారు మూల్యం చెల్లించాల్సిందేనని ఆయన చెప్పారు.
ఏండ్ల తరబడి గిరిజన ప్రజలను చీకట్లో ఉంచారని, తమ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసేందుకు లెఫ్టిస్టులు వారిని తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు. స్వాతంత్య్రం తర్వాత 60, 75 ఏండ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ గిరిజనుల అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఆరు దశాబ్దాల పాటు గిరిజనులకు ఇండ్లు, స్కూళ్లు లేదా మొబైల్ టవర్లను కాంగ్రెస్ అందుబాటులోకి తీసుకురాలేదు. కాని ఇప్పుడు మీరేం చేశారని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.
1970వ దశకం నుంచి వీటిని ఎందుకు సాధించలేకపోయారని నక్సలిజాన్ని సమర్థించే వారిని నేను ప్రశ్నిస్తున్నాను అని అమిత్ షా నిలదీశారు. బస్తర్ నుంచి నక్సలిజాన్ని దాదాపు పూర్తిగా నిర్మూలించామని, ప్రతి గ్రామంలో పాఠశాలలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో రేషన్ షాపులు ఏర్పాటు చేశామని, ప్రతి తహసీల్ పంచాయత్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గిరిజన తండాలకు అభివృద్ధి ఎందుకు చేరలేదని నక్సల్ సానుభూతిపరులను అమిత్ షా ప్రశ్నించారు. మావోయిస్టు భావజాలంతో ప్రభావితురాలైన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో నక్సల్బరీలో ప్రారంభమైన ఉద్యమం 12 రాష్ర్టాలకు వ్యాపించి, 17 శాతం భూభాగాన్ని ఆక్రమించి 10 శాతానికి పైగా జనాభాను ప్రభావితం చేసిందని ఆయన ఆరోపించారు.
నక్సలైట్లను భగత్ సింగ్ లేదా బిర్సా ముండాతో పోల్చడాన్ని అమిత్ షా తప్పుపట్టారు. ఇదేం బరితెగింపు అని ఆయన ప్రశ్నించారు. భగత్ సింగ్, బిర్సా ముండా బ్రిటిష్ పాలకులపై పోరాడారని, కాని నక్సలైట్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆయుధాలు చేపట్టి అమాయక ప్రజలను హతమార్చారని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించి 4,800 మంది నక్సల్స్ లొంగిపోయారని, 2 వేల మందికిపైగా నక్సల్స్‌ను జైళ్లకు పంపామని అమిత్ షా చెప్పారు. తమ సిద్ధాంతాన్ని అనుసరించేలా గిరిజనులను నక్సల్స్ మార్చివేశారని, గిరిజనులు విద్యావంతులైతే తమతో ఉండరన్న భయంతో వారిని సూళ్లకు, బ్యాంకులకు, ఆరోగ్య కేంద్రాలకు దూరం చేశారని ఆయన ఆరోపించారు. నక్సల్ విముక్త భారత్ కోసం ప్రాణాలు కోల్పోయిన వేలాది జవాన్లకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టిన విపక్షాలపై హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. 2011 నాటి సల్వా జుడుం కేసు తీర్పును ఆయన ఖండించారు. నాటి కేసులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇస్తూ నక్సలైట్లపై ప్రభుత్వాల పోరాటాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించింది. దీని పర్యవసానాలేంటి? సల్వా జుడుం ఉద్యమంతో సంబంధం ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ చంపివేశారు. అదే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆ తర్వాత ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థిగా ఎంపికయ్యారు అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ దేశంలో శాంతి భద్రతలను పాటించేవారు సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఎన్నడూ ఎంచుకోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.