న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: బంగారం, వెండి ధరలు కొండదిగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేమి కారణంగా దేశీయంగా ధరలు 2 శాతం వరకు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి రూ.2.45 లక్షలకు దిగిరాగా, బంగారం రూ.1.57 లక్షలకు దిగొచ్చింది. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించిన సమాచారం ఆధారంగా వెండి రూ.5 వేలు లేదా 2 శాతం తగ్గి రూ.2.45 లక్షలకు పడిపోయినట్టు తెలిపింది. సోమవారం ఈ ధర రూ.2.50 లక్షలుగా ఉన్నది.
వెండితోపాటు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.2,200 లేదా 1.4 శాతం తగ్గి రూ.1,57,000కి తగ్గింది. ఆసియా మార్కెట్లకు సెలవు కావడం, మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టడంతో భవిష్యత్తులో యూఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అనలిస్ట్ కావేరి మోర్ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి 1.65 డాలర్లు లేదా 5.15 శాతం తగ్గి 73.58 డాలర్లకు పడిపోయింది. అలాగే బంగారం 3.04 శాతం తగ్గి 4,907.70 డాలర్ల వద్ద ఉన్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావడంతో వరుసగా రెండు రోజులుగా అతి విలువైన లోహాల ధరలు దిద్దుబాటునకు గురవుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ రీసర్చ్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.