EAM Jaishankar : ఒక దేశం శక్తిమంతమైన దేశమైనంత మాత్రాన అది తన ఇష్టాలను ఇతరులపై రుద్దడం సరికాదని భారత విదేశాంగమంత్రి (External Affairs Minister of India) ఎస్ జైశంకర్ (S Jaishankar) స్పష్టంచేశారు. ప్రపంచీకరణ మన ఆలోచన, పని విధానాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. శనివారం మహారాష్ట్ర (Maharastra) పుణెలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్‌లో జరిగిన స్నాతకోత్సవంలో కేంద్రమంత్రి మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, అనేక అధికార కేంద్రాలు ఉద్భవించాయని మంత్రి జైశంకర్ చెప్పారు. అధికారం అనేదానికి ఎన్నో అర్థాలు ఉంటాయని.. వాణిజ్యం, మిలిటరీ, ఇంధనం, సాంకేతికత, ప్రతిభ ఆధారంగా అవి మారుతుంటాయని పేర్కొన్నారు. ఈ అధికారం ఏ ఒక్క దేశానికి పరిమితం కాదని, ఈ విషయాన్ని గ్లోబల్ పవర్స్ గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎంత శక్తిమంతమైన దేశమైనా సరే అది తన ఇష్టాలను ఇతరులపై రుద్దలేదని, ప్రపంచ దేశాల మధ్య సహజమైన పోటీ ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇక భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు తయారీ రంగంలో దూసుకువెళ్లాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తుచేశారు. ఇదిలావుంటే ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి.
ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్ భారత వస్తువులపై టారిఫ్‌ను రెట్టింపు చేసి 50 శాతానికి చేర్చారని మంత్రి చెప్పారు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ దిగుమతులపై భారత్ పన్నులు తగ్గించాలని అగ్రరాజ్యం కోరుతోందని, అందుకు భారత్ ఒప్పుకోవడం లేదని తెలిపారు. ఆ నేపథ్యంలోనే ట్రంప్ టారిఫ్‌లను ఆయుధంగా వాడుకుంటున్నారని అన్నారు.