Aamani BJP |టాలీవుడ్ సీనియర్ నటి ఆమని రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. శనివారం ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరింది. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో ఆమని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాంచందర్ రావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆమనీతో పాటు ప్రముఖ సినీ మేకప్ ఆర్టిస్ట్ శోభలత కూడా ఇదే వేదికపై కాషాయ గూటికి చేరారు.
పార్టీలో చేరిన తర్వాత ఆమని మీడియాతో మాట్లాడుతూ.. తన మనసులోని మాటను పంచుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గర్వించదగ్గ స్థాయికి చేరుకుంది. భారతీయురాలిగా గర్వపడేలా చేసిన ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాను అని ఆమని తెలిపారు. మోదీ ప్రభుత్వం సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆమె పేర్కొన్నారు. పదవుల కోసం కాకుండా, కేవలం సామాన్య ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.
1992లో ‘జంబలకిడిపంబ’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆమని, ఆ తర్వాత తెలుగు చిత్రసీమలో అగ్ర నటిగా ఎదిగారు. ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’, ‘శుభ సంకల్పం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ నటి ‘మిస్టర్ పెళ్లాం’ చిత్రంలో ఆమె నటనకు గాను ప్రతిష్టాత్మక నంది అవార్డు లభించింది.