హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): సింగరేణి సేవలకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్(ఈఈఎఫ్) తెలంగాణ సింగరేణి సేవలకు గ్లోబల్ సీఎస్ఆర్ అవార్డు అందజేసింది. గురువారం వర్చువల్ పద్ధతిలో 12వ అంతర్జాతీయ పెట్రో-కోల్ సదస్సు, ప్రదర్శన – 2022 కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పీ అండ్ సీ) ఎన్ బలరామ్ అవార్డును ఆన్లైన్లో స్వీకరించారు. సింగరేణి కాలరీస్ కొన్నేళ్లుగా చేపట్టిన సీఎస్ఆర్ కార్యక్రమాలకు ప్లాటినం విభాగంలో మొదటి బహుమతి లభించింది.
ఈ సందర్భంగా ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డాక్టర్ అనిల్‌కుమార్ గాడ్గె మాట్లాడుతూ… దక్షిణ భారత ఇంధన అవసరాలు తీర్చడంలో సింగరేణి ప్రధానపాత్ర పోషిస్తోందని కొనియాడారు. సింగరేణి చేపట్టిన సీఎస్ఆర్ కార్యక్రమాలతో 150కిపైగా గ్రామాల ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ఈ సదస్సులో ప్రముఖ అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ నిపుణులు డాక్టర్ అంటోని యూస్ ప్రధానోపన్యాసం చేశారు. ఈఈఎఫ్కు చెందిన అనిల్ రజ్దాన్, పునీత్సింగ్, ఐశ్వర్య పాల్గొన్నారు.