న్యూఢిల్లీ, జూలై 20: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సార్వత్రిక బడ్జెట్లో గృహ కొనుగోలుదారులకు, తక్కువ ధరతో ఇండ్లను నిర్మించే బిల్డర్లకు మరిన్ని పన్ను ప్రయోజనాలు కల్పించాలని రియల్టీ బాడీ క్రెడాయ్ కోరుతున్నది. రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ గాడినపడాలంటే కేంద్ర ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహక నిర్ణయాలు తీసుకోవాలని, ముఖ్యంగా పన్ను రాయితీలు కల్పించినప్పుడే ఈ రంగ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగే అవకాశాలున్నాయని పేర్కొంది. కొత్తగా గృహాలు కొనుగోలుచేసేవారికి వడ్డీ రాయితీని పెంచాలని, అలాగే మళ్లీ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీంను ప్రవేశపెట్టాలని, అప్పుడే చౌక ధర కలిగిన గృహాలకు డిమాండ్ ఉంటుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. ప్రస్తుతం రూ.2 లక్షలుగా ఉన్న డిడెక్షన్ను రూ.5 లక్షలకు పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరుతున్నట్లు చెప్పారు.