న్యూఢిల్లీ: సీనియర్ నేత గులాంనబీ ఆజాద్.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన ఇవాళ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఆజాద్.. పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల లేఖను ఆయన రాశారు. పార్టీలో సంప్రదింపుల ప్రక్రియ లేకుండాపోయిందని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైనట్లు ఆయన తెలిపారు.
ఆజాద్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి భారీ జలక్ తగిలినట్లు అయ్యింది. ఇటీవల మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా ఆ పార్టీకి చెందిన కీలక పోస్టుకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏఐసీసీ కోటరీలో పట్టుదల, సత్తా లోపించిందన్నారు. ఈ నేపథ్యంలో చాలా బాధాకర రీతిలో 50 ఏళ్లు సేవ చేసిన పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆజాద్ తన లేఖలో తెలిపారు.
రాహుల్ గాంధీ వైఖరిపై ఆజాద్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ అపరిపక్వత పార్టీలో ఉన్న సంప్రదింపుల వ్యవస్థను నాశనం చేస్తోందని పేర్కొన్నారు. చాన్నాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. జీ-23 తిరుగుబాటుదారుల్లో గులాంనబీ ఆజాద్ కీలక వ్యక్తిగా నిలిచారు.