GHMC | కాప్రా, మే 15 : కాలనీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కాలనీవాసులు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. ఇండ్లు, వాణిజ్య ప్రాంతాల చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ చెత్త ఆటోకు ఇవ్వడం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగుతుందని అన్నారు. జవహర్‌నగర్ పర్యటనకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఏఎస్ రావు నగర్ డివిజన్ భవానీనగర్ కాలనీలో కర్ణన్ ఆగారు. అక్కడ కాలనీవాసులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడుతూ.. కాలనీలో పారిశుద్ధ్యం సక్రమ నిర్వహణకు కాలనీ ప్రజలు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగానికి సహకరించాలని కోరారు. ఇంట్లోని, వాణిజ్య ప్రాంతాల్లోని చెత్తను బయట పడవేయకుండా, ఆయాప్రాంతాలకు వచ్చే చెత్త ఆటోలకు ఎప్పటికప్పుడు తడి, పొడి చెత్తలను వేరు చేసి అందజేయడం వల్ల పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని, ఇంటి పరిసరాలు, కాలనీలు పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. చెత్తను వేరు చేసి ఇవ్వడం జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుపై భారం తగ్గుతుందని తెలిపారు.
ఎగువనుంచి వచ్చే వర్షపు నీరు కాలనీలో నిలవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇందుకోసం స్టార్మ్ వాటర్ డ్రెయిన్లను నిర్మించాలని, పారిశుద్ధ్య విభాగంలో ఖాళీలను భర్తీ చేయాలని, సిబ్బందిని పెంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కాలనీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్.. తగిన చర్యలు తీసుకోవాలని కాప్రా సర్కిల్ డీసీ జగన్, ఈఈ నాగేందర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో ఖాళీగా ఉన్న స్థానాలను రక్తసంబంధీకుల నుంచి భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఇటీవలే ఆదేశాలు జారీ అయ్యాయని, త్వరలో ఖాళీగా ఉన్న స్థానాల్లో సిబ్బందిని భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కాలనీలో ఎలాంటి సమస్యలు లేకుండా, భవానీనగర్ కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ సహకరించాలని కాలనీ మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాలనీ సమస్యలపై కాలనీ అధ్యక్ష కార్యదర్శులు వి.శేఖర్, శ్రీరాములు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.