హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్: నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో తెలంగాణ టాప్ 3 స్థానం సాధించడం అభినందనీయమని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆరోగ్య సూచీలో తెలంగాణ ప్రతి ఏటా ప్రగతి సాధిస్తున్నదని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్‌లో చేపట్టిన సహాయ చర్యలు, గ్రామాల దత్తత, హరితహారం, ఇతర అభివృద్ధి పథకాలు బాగున్నాయని కొనియాడారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ అంతర్జాతీయ సదస్సులో బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. గతేడాది అనుభవాలను గుణపాఠంగా స్వీకరించి తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, టీకాలు వేసుకోవడం కర్తవ్యంగా భావించాలని హితవు పలికారు. వైరస్‌పై సాగిస్తున్న పోరాటం సఫలం కావాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైద్యరంగంలో భారత్, అమెరికా సంస్థలు సమన్వయంతో పనిచేస్తే ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని ఉప రాష్ట్రపతి ఆకాంక్షించారు. భారతీయ సంతతి వైద్యులు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతున్నారని కొనియాడారు. ఎంత ఎత్తుకెదిగినా మాతృభూమి రుణం తీర్చుకోవడాన్ని విస్మరించకూడదని చెప్పారు. వైద్యసేవల్లో గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. టెలిమెడిసిన్ ద్వారా గ్రామాల్లో కూడా ప్రాథమిక వైద్య సేవలను విస్తరించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. స్టార్టప్‌ల సేవలతో వైద్య ఖర్చులు తగ్గేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఏఏపీఐ సభ్యులు డాక్టర్ కత్తుల సతీశ్, డాక్టర్ కిషన్‌కుమార్, డాక్టర్ ఉదయ్ శివంగి, డాక్టర్ పున్నం సుజిత్, డాక్టర్ ద్వారకానాథ్‌రెడ్డి, డాక్టర్ రవికోహ్లీ పాల్గొన్నారు.