Muhammad Yunus : భారతదేశ వ్యతిరేకి, ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ (Osman Hadi) ఆదర్శాలను తాము ముందుకు తీసుకెళ్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) అన్నారు. హాదీ అంత్యక్రియల్లో పాల్గొన్న యూనస్.. అక్కడున్న వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు.
‘ఉస్మాన్ హాదీ నేను మీకు వీడ్కోలు చెప్పేందుకు ఇక్కడకు రాలేదు. బంగ్లాదేశ్ ఉన్నంత కాలం ఈ దేశ ప్రజలందరి హృదయాల్లో మీరు ఉంటారు. అక్కడి నుంచి నిన్ను ఎవరూ తొలగించలేరు. నువ్వు మాకు చెప్పిన మాటను నెరవేరుస్తామని ప్రమాణం చేస్తున్నా. దేశ ప్రజలందరూ మీ ఆదర్శాలను కొనసాగిస్తారు’ అని యూనస్ వ్యాఖ్యానించారు.
హాదీ ప్రేమ, మానవత్వం, ప్రజలతో కలిసిపోయే విధానాన్ని యూనస్ ప్రశంసించారు. ఈ దేశం మరచిపోలేనీ మంత్రాన్ని హాదీ తమకు ఇచ్చారని, అది ఎప్పటికీ తమ చెవుల్లో ప్రతిధ్వనిస్తుందని అన్నారు. ప్రపంచం ముందు బంగ్లా తలెత్తుకుని ఉంటుందని, ఎవరి వద్ద తలవంచదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాల్గొనాలనే హాదీ అకాంక్ష గురించి గుర్తుచేశారు.
కాగా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు గత ఏడాది విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో హాదీ కీలకపాత్ర పోషించాడు. ఈనెల ఆరంభంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. దాంతో ఆయన చికిత్స పొందుతూ మృతిచెందాడు. హాదీ మృతితో బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.