Arun Khetarpal | బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర ఆఖరి చిత్రం ‘ఇక్కీస్’ (Ikkis) జనవరి 01న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. చిన్న వయసులోనే దేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్రను అందుకున్న వీరుడు, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ (Arun Khetarpal) జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’ (Ikkis). ఈ బయోపిక్‌లో అరుణ్ ఖేతర్పాల్ పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద (Agastya Nanda) నటిస్తుండగా.. దివంగత నటుడు ధర్మేంద్ర, పాతల్ లోక్ నటుడు జైదీప్ అహ్లావత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘అంధాధున్’ ఫేం దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మొదట డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అవతార్, ధురంధర్ చిత్రాల వలన వాయిదా పడింది. దీంతో జనవరి 01 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ గురించి ధర్మేంద్ర మాట్లాడిన చివరి మాటాలను చిత్రబృందం తాజాగా పంచుకుంది.
ఈ సినిమా షూటింగ్ చివరి రోజున ధర్మేంద్ర మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కేవలం భారతీయులే కాకుండా దాయాదీ దేశం పాకిస్థానీయులు కూడా చూడాలని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. సన్నీ డియోల్ షేర్ చేసిన ఈ వీడియోలో ధర్మేంద్ర సినిమా సెట్స్‌పై చాలా ఉత్సాహంగా కనిపించారు. ఈ టీమ్‌తో పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. శ్రీరామ్ సినిమాను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అని ధర్మేంద్ర పేర్కొన్నారు. అనంతరం భారత్ మరియు పాకిస్థాన్.. ఈ రెండు దేశాల ప్రజలూ ఈ సినిమాను చూడాలని నేను కోరుకుంటున్నాను. షూటింగ్ చివరి రోజు కావడంతో నాకు ఒకవైపు సంతోషంగా, మరోవైపు బాధగా ఉంది. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. నా వల్ల ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించండి. అంటూ ధర్మేంద్ర చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మరోవైపు తన తండ్రి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సన్నీ డియోల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. “నాన్న చిరునవ్వు చీకటిని సైతం పారద్రోలేది. ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఆయన మనకు అందించిన ఆఖరి కానుక ‘ఇక్కిస్’. ఈ నూతన సంవత్సరంలో థియేటర్లలో ఆయనను చూసి సెలబ్రేట్ చేసుకుందాం” అని పేర్కొన్నారు.