న్యూఢిల్లీ, మార్చి 25: వచ్చే నెలతో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాల్లో ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ కోతలు పెట్టింది. రాబోయే ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతానికే పరిమితం కాగలదని మంగళవారం పేర్కొన్నది. కాగా, ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) రీజియన్లోని దేశాలు అమెరికా టారిఫ్లు, గ్లోబలైజేషన్ మార్పులకు ప్రభావితం కాగలవన్న అంచనాల మీదనే ఈ జీడీపీ కోతలకు ఎస్అండ్పీ వచ్చింది. ఇంతకుముందు ఈ అంచనా 6.7 శాతంగా ఉండటం గమనార్హం. ఇదిలావుంటే ఏపీఏసీ దేశాల్లో వడ్డీరేట్ల కోతలు ఇకముందూ కొనసాగుతాయని అభిప్రాయపడింది. ఇందులో భాగంగానే ఆర్బీఐ రాబోయే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపోరేటును మరో 75-100 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చన్నది.