న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన దేశ జీడీపీ 9.2 శాతం వృద్ధితో రూ.147.5 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు. ఒక సభ్యుడి ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానాన్ని ఇస్తూ 2014-15లో రూ.105.3 లక్షల కోట్లున్న జీడీపీ 2020-21లో రూ.135.6 లక్షల కోట్లకు పెరిగినట్లు జాతీయ గణాంకాల శాఖ (ఎన్ఎస్వో) వెల్లడించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.147.5 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చౌదరి వివరించారు. ప్రైవేటు రంగ పెట్టుబడులు పెరగడానికి ఎంఎస్ఎంఈ నిర్వచనంలో మార్పు, కొత్త పీఎస్యూ పాలసీ, బొగ్గుగనుల వాణీజ్యీకరణ, రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఎఫ్డీఐ పరిమితుల పెంపు తదితర వ్యవస్థాగత సంస్కరణలు ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు.