న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ పుల్లెల గాయత్రి గోపీచంద్ ఉబర్ కప్ ఫైనల్స్ నుంచి కూడా వైదొలిగింది. గాయం కారణంగా ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి దూరమైన తాజాగా ఉబర్ టోర్నీకి దూరమైంది. గాయం తీవ్రత తగ్గకపోవడంతో టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బ్యాంకాక్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న ఈ టోర్నీలో మహిళల డబుల్స్‌లో త్రిషా జాలీతో కలిసి గాయత్రి బరిలోకి దిగాల్సి ఉంది. ఈ టోర్నీ నుంచి ఇప్పటికే భారత మహిళల జోడీ సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప దూరమైన విషయం తెలిసిందే. తాజాగా గాయత్రి కూడా వైదొలుగడంతో భారత్ ప్రాతినిధ్యం తగ్గింది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుతో పాటు ఆకర్షి కశ్యప్, అష్మిత చాలిహ, ఉన్నతి హుడా బరిలోకి దిగుతున్నారు.