
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రెండు మనసులు కలిస్తే ప్రేమ. అది నమ్మకంతో కొనసాగితే పెండ్లి. దీనికి జెండర్‌తో పనేముందని అనుకున్నారు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు. ప్రేమించుకొని శనివారం రెండు కుటుంబాల సభ్యులు, బంధువుల సమక్షంలో ఒక్కటయ్యారు. దేశంలోనే తొలిసారి జరిగిన గే పెండ్లికి వికారాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్ వేదికైంది. ఎనిమిది ఏండ్ల క్రితం ఓ డేటింగ్ యాప్‌లో సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. సుప్రియో హైదరాబాద్‌లోని హోటల్ మేనేజ్మెంట్ స్కూల్లో లెక్చరర్‌గా, అభయ్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
ఒకరి భావాలు ఒకరు తెలుసుకొని ప్రేమికులుగా మారారు. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని తల్లిదండ్రులకు చెప్పారు. వారి అంగీకారంతో, రెండు కుటుంబాల సమక్షంలో ట్రాన్స్‌జెండర్ సోఫియా డేవిడ్ వీరి వివాహాన్ని జరిపించారు. స్వలింగ సంపర్కుల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ స్నానాలు, సంగీత్ కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్లంతా వీరిని ఆశీర్వదించారు.