మాడ్గుల, జూన్9: మాడ్గుల ప్రభుత్వ కాలేజీ ముందు స్థలం వ్యర్థాలకు నిలయంగా మారింది. పలువురు చికెన్ వ్యాపారాలు రాత్రిపూట కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి ఈ కాలేజీ ముందే వేసి వెళ్లిపోతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు చేసుకునే వారు కూడా ఇక్కడే వ్యర్థాలను వేస్తున్నారు. ఇదే కాకుండా గ్రామపంచాయతీ చెత్తను కూడా కాలేజీ ప్రాంగణం సమీపంలోనే వేసి వెళ్తున్నారు.
ఈ వ్యర్థాల ద్వారా దుర్వాసన వెదజల్లడంతో కాలేజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలేజీలో నుంచి బయటకొస్తే వాసన భరించలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఈ చెత్త సమస్యను తీర్చాలని అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా వ్యర్థాలను తమ కాలేజీ ముందు వేయకుండా నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.