హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గత సీజన్‌తో సమానంగా ఈసారి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గత సీజన్లో నవంబర్ 13 వరకు 8 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, ప్రస్తుత సీజన్లో ఈ నెల 13 నాటికి 4,039 కేంద్రాల ద్వారా 1.13 లక్షల మంది రైతుల నుంచి 7.71 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు. ఇందుకు సంబంధించి రైతులకు రూ.1,510 కోట్లు చెల్లించామని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నట్టు చెప్పారు. వర్షాలు పడే అవకాశం ఉండటంతో ధాన్యం తడువకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఇప్పటివరకు 77 శాతం రేషన్ బియ్యం పంపిణీ పూర్తయిందని, 67 లక్షల కార్డుల లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకున్నట్టు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. పొలం నుంచి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.