కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఆగస్టు 23 : పాలిటెక్నిక్ విద్యతో పాలిటిక్స్ ఆడొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు జారీ చేసిన జీవో -97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. జీవో- 97 వల్ల తాము ఎదురొంటున్న సమస్యలను విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన విద్యార్థినులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. జీవో-97తో పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. పాలిటెక్నిక్‌ను పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత విద్యలో అనేక అవకాశాలు ఉన్నాయని, అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు గ్రాడ్యుయేషన్‌కు అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.