గ్యాంగర్స్
ఓటీటీ హిట్
అమెజాన్ ప్రైమ్ : స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం : వడివేలు, సుందర్, కేథరిన్, మైమ్ గోపీ, భగవతీ పెరుమాల్, అరుళ్దాస్ తదితరులు, దర్శకత్వం : సుందర్ సి
Gangers | కొన్ని కథలు చాలా కామన్‌గా కనిపిస్తాయి. ఓ సమస్య. దాన్ని పరిష్కరించే హీరో. అతణ్ని చూసి మనసు పారేసుకొనే ఓ హీరోయిన్. మామూలుగా చూపిస్తే ‘యావరేజ్ సినిమా’నే వస్తుంది. కానీ, ఆ సమస్య ఏమిటి? దానిని హీరో ఎలా పరిష్కరించాడు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అనే అంశాలే ఆ కామన్ కథను కూడా అదిరిపోయే చిత్రంగా మలుస్తాయి. ఇక మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులు.. సినిమాను హిట్టు బాట పట్టిస్తాయి.
అలా ప్రేక్షకులు ఏమాత్రం ఊహించలేని ట్విస్టులతో అలరిస్తున్న సినిమా.. గ్యాంగర్స్. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ తమిళ డబ్బింగ్ చిత్రం.. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా కథ.. ఓ పల్లె నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊరిని మల్లేశ్ (మైమ్ గోపీ), కోటేశ్ (అరుళ్ దాస్) అనే అన్నదమ్ములు నియంత్రిస్తుంటారు. పల్లెను తమ అక్రమ వ్యాపారాలకు అడ్డాగా చేసుకొని.. అన్ని పనులనూ తమ కనుసన్నల్లోనే నడిపిస్తుంటారు.
అయితే ఈ విషయాలేవీ బయటి ప్రపంచానికి తెలియదు. చెప్పడానికి ఎవరూ ప్రయత్నించరు కూడా! ఇలా ఉండగా.. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదివే రమ్య అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. అదే స్కూల్లో సుజిత (కేథరిన్) టీచర్‌గా, సింగరం (వడివేలు) పీఈటీగా పనిచేస్తూ ఉంటారు. ‘రమ్య’ కనిపించకుండా పోయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తుంది సుజిత.
ఆ సమయంలోనే అదే స్కూల్‌కు పీఈటీగా వస్తాడు శరవణన్ (సుందర్). స్కూల్‌ను అడ్డుపెట్టుకుని మల్లేశ్ – కోటేశ్ చేస్తున్న అక్రమాలను శరవణన్ గమనిస్తాడు. వాళ్లను నడిపిస్తున్న పెద్ద తలకాయనూ గుర్తిస్తాడు. మరి.. శరవణన్ నిజంగానే ఆ ఊరికి ‘పీఈటీగా వచ్చాడా? ఇంకేదైనా కారణం ఉందా? ఆయన ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? అక్రమార్కులను నడిపిస్తున్న ఆ పెద్ద తలకాయ ఎవరు? రమ్య కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? సినిమా నడుస్తున్న కొద్దీ.. ఇలాంటి మరెన్నో చిక్కుముడులు విడివడుతుంటాయి.