
నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం
పోచమ్మమైదాన్, నవంబర్ 14: వరంగల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మద్రాసీ చక్కర్ బీడీ పరిశ్రమ వ్యవస్థాపకుడు ప్రొద్దుటూరి గంగారెడ్డి (94) ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖాన లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని హనుమకొండ నయీంనగర్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగారెడ్డి చిన్నతనంలోనే వరంగల్‌కు వచ్చి స్థిరపడ్డారు. వరంగల్‌లో 7దశాబ్దాల క్రితం మద్రాసీ చక్కర్ బీడీ ఫ్యాక్టరీ స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. నాడు అజంజాహీ మిల్లు తర్వాత కార్మికులు గంగారెడ్డి బీడీ పరిశ్రమను నమ్ముకొని బతికేవారు. ఇక్కడ తయారుచేసిన బీడీలను ఎక్కువగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు ఎగుమతి చేసేవారు. ఈ బీడీ ఫ్యాక్టరీ ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగునింపడంతోపాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో గంగారెడ్డి ముందుండే వారు. గంగారెడ్డికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. గంగారెడ్డి మృతిపట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తదితరులు సంతాపం తెలిపారు.