వినాయక నగర్ : ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులు గల పాత దొంగల ముఠాను (Theft Gang) నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన నలుగురు సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి ఆటోలో సంచరిస్తూ, వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ఈ పాత నేరస్థులకు సంబంధించిన వివరాలను శనివారం నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి (ACP Raja Venkat Reddy ) తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాందేవ్వాడలో శ్రీ బాలాజీ ట్రాన్స్పోర్టు కార్యాలయంలో నలుగురు దొంగలు పడి తాళాలు ధ్వంసం చేసి రూ. పది లక్షలకు పైగా నగదు దొంగిలించుకుపోయారు.
ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం వాహనాల తనిఖీలు( Vehicle Checking ) నిర్వహిస్తుండగా ఆటో రిక్షాలో అనుమానాస్పదంగా వచ్చిన నలుగురిని పట్టుకొని విచారించినట్లు ఏసీపీ తెలిపారు. నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, దొడ్డి కొమరయ్య కాలానికి చెందిన సురేకర్ ప్రకాష్, సాయినాథ్ విట్టల్ రావు ముక్తే , నాగారాంకు చెందిన సయ్యద్ షాదుల్లా అనే నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా ట్రాన్స్పోర్టు కార్యాలయంలో దొంగతనానికి పాల్పడినట్లుగా అంగీకరించాలని వివరించారు.
నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ.10 లక్షల 17వేల నగదు తో పాటు, చోరీకి వినియోగించిన ఆటోను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించామన్నారు. ఈ నలుగురు నిందితులపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 40 దొంగతనం కేసులు ఉన్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు నగర సీఐ శ్రీనివాస్ రాజ్, సీసీఎస్ సిఐ సురేష్, మూడోటోన్ ఎస్సై హరిబాబు కృషి చేశారని వివరించారు.