ఆదిలాబాద్ : జల్సా లకు అలవాటు పడి ముఠాగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులుగా గల అంతరాష్ట్ర దొంగల ముఠాను ( Interstate Gang ) ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ( SP Mahajan ) విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
బేల మండల కేంద్రానికి చెందిన మోటర్ మెకానికల్ సుమిత్, మరో మైనర్, షకీల్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన దాని కృష్ణతో ముఠాను ఏర్పాటు చేశారు. ముఠా సభ్యులు ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో 12 మోటార్ సైకిళ్లను దొంగతనం చేశారని వివరించారు. ఈనెల 17న జైనథ్ లక్ష్మి నారాయణ ఆలయం ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాన్ని దొంగలించారంటూ రమేష్ అనే వ్యక్తి జైనథ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జైనథ్ మండలం దీపాయిగూడ ప్రాంతంలో రాత్రి సమయంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆపకుండా పారిపోయారు. వీరిని వెంబడించి పట్టుకుని విచారించగా మోటార్ బైకుల దొంగతనం బయటపడింది. దొంగతనం వాహనాలను కొనుగోలు చేసిన స్క్రాప్ వ్యాపారులు షేక్ ఇబ్రహీం, అబ్రార్ ఖాన్ తో పాటు మెకానిక్ సాయిలుపై కూడా కేసు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. ముఠా సభ్యుల నుంచి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.