భీమదేవరపల్లి, ఆగస్టు 5: ఇసుక మాఫియా రోజురోజుకు పేట్రేగిపోతుంది. ఎవరి భూమి అయినా సరే. నాకేం సిగ్గు అన్న చందంగా మట్టిని ఇసుకగా జల్లడబడుతూ ఇసుకగా మార్చి అడ్డగోలుగా అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ సంబంధం లేనట్టు మిన్నకుంటున్నారు. తమ భూములు సర్వం కోల్పోతున్నామని బాధిత రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్న ఈ మాఫియా ఆగడాలు హద్దు అదుపూ లేకుండా పోతుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో ప్రజా ప్రతినిధులు, రాజకీయ అండదండలతో పట్టపగలు ఇందిరమ్మ ఇండ్లకు ఇష్టారీతిగా ఇసుకను సరఫరా చేస్తున్నారు.
చివరకు ఈ మాఫియా ఆగడాలు పాఠశాలల వరకు చేరింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ముల్కనూర్ లోని మోడల్ స్కూల్ ను సందర్శించారు. పాఠశాలలో కావాల్సిన సదుపాయాలను గూర్చి నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇది జరిగి పది రోజులు కాకముందే అభివృద్ధి కార్యక్రమాల పేరిట పాఠశాల ఎదుట ఇసుక డంప్ అయింది. అయితే అది ఇసుకనా లేక మట్టినా అనేది తెలియకుండా పోయింది. పాఠశాలకు వస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా ఆ మట్టిని చేసి ఇదేనా ఇసుక అంటూ వాపోతున్నారు.
ఇటువంటి ఇసుక వంటి మట్టితో కట్టడాలు నిర్మిస్తే అర్ధాంతరంగా కూలిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. మట్టిని ఇసుకగా జల్లెడ పడుతున్న ట్రాక్టర్ ఇంజన్లకు నెంబర్లు ఉండవు, డబ్బాలకు అంతకంటే నెంబర్లు ఉండవు, నడుపుతున్న డ్రైవర్లు మైనర్లు లేదా కాగితాలు ఉండవు, లైసెన్సు ఉండవు, అయినా నన్ను ఎవరు ఏం చేస్తారని ధీమాగా రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు తమదంటే తమది ఈ డిపార్ట్మెంట్ బాధ్యత కాదని దాటవేస్తున్నారు. మట్టిని ఇసుకగా మార్చి సొమ్ము చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.