సూర్యాపేట : ప్రముఖ కంపెనీల లోగోలతో కల్తీ ఇంజినాయిల్ విక్రయిస్తున్న ముఠాను గురువారం సూర్యాపేట పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ముంబై నుంచి లూజ్ ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసి ప్రముఖ కంపెనీల ఇంజినాయిల్ డబ్బాల్లో సీజ్ చేసి అమ్ముతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారన్నారు.
నిందితులు విజయవాడ కేంద్రంగా చేసుకొని పట్టణానికి ఈ కల్తీ అయిల్ను తీసుకొచ్చి దుకాణాలలో తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు.
వాహనదారులు ఆయిల్స్ కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా తనిఖీ చేసుకోవాలని ఈ సందర్భంగా డీఎస్పీ నాగభూషణం సూచించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్ఐ క్రాంతికుమార్, సిబ్బందిని ఆయన అభినందించారు.