Ganesh Chaturthi | ఒక మహా ప్రళయం. ఆ తర్వాత జలప్రళయం. ఆ జలరాశిలో లోహపు బంతిలా తేలియాడుతున్నాయి సమస్త విశ్వాలూ. అప్పటి వరకూ అణురూపుడై ఉన్న ఆదిగణపతి .. విరాట్ స్వరూపాన్ని ధరించాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు – త్రిమూర్తులు ఆవిర్భవించారు. ఆకాశం, భూమి, పాతాళం – త్రిలోకాలు ప్రాణం పోసుకున్నాయి. ముగ్గురు మూర్తులకు తమ జన్మ వృత్తాంతం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. త్రికాలజ్ఞాని గణపతి మాత్రమే ఆ పరమ రహస్యాలను వివరించగలడని భావించారు. మహాగణపతి కటాక్షం కోసం ఘోర తపస్సు చేశారు. ఆ సాధనకు మెచ్చి జ్ఞాన గణపతి సాక్షాత్కరించాడు. దేవదేవుని దివ్యమంగళ విగ్రహానికి ప్రణమిల్లి.. భక్తితో స్తుతించారు సృష్టి-స్థితి-లయకారులు. వేదవ్యాస విరచిత శ్రీ గణేశ పురాణంలోని ఆ బ్రహ్మవిష్ణు మహేశ్వరకృత గణేశ్వర స్తోత్రమ్..
అజం నిర్వికల్పం నిరాకార మేకం
నిరానన్ద మద్వైత మానన్దపూర్ణమ్
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం
పరబ్రహ్మరూపం గణేశం భజేమ ॥
(పుట్టుక లేనివాడు, అఖండ స్వరూపుడు, పరిపూర్ణుడు, పరబ్రహ్మస్వరూపుడైన గణపతిని భజిద్దాం)
గుణాతీతమాద్యం చిదానందరూపం
చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యమ్
మునిధ్యేయ మాకాశరూపం పరేశం
పరబ్రహ్మరూపం గణేశం భజేమ ॥
(గుణాలకు అతీతుడు, ఆద్యుడు, చిదానందరూపుడు, చిదాభాస స్వరూపుడు, సర్వం తెలిసినవాడు, మునులచేత కొలువబడేవాడు, ఆకాశస్వరూపుడు, పరేశుడు, పరబ్రహ్మరూపుడైన గణపతిని భజిద్దాం)
జగత్కారణం కారణజ్ఞానరూపం
సురాదిం, సుఖాదిం, యుగాది౦ గణేశమ్
జగద్వ్యాపినం విశ్వవన్ద్యం సురేశం
పరబ్రహ్మరూపం గణేశం భజేమ ॥
(జగత్కారణుడు, కారణరూపుడు, వేల్పులకు వేల్పు, సర్వసుఖాలకు ఆదిరూపుడు, యుగాలకు ఆద్యుడు, సమస్త జగాలలో వ్యాపించి ఉన్నవాడు, విశ్వమంతటితో పూజలు అందుకునేవాడు, దేవదేవుడైన గణపతిని భజిద్దాం)
రజోయోగతో బ్రహ్మరూపం శ్రుతిజ్ఞం
సదాకార్యచిత్తం హృదాచిన్త్యరూపమ్
జగత్కారకం సర్వవిద్యానిధానం
పరబ్రహ్మరూపం గణేశం భజేమ ॥
(రజోగుణ సంపర్కం వల్ల బ్రహ్మరూపుడు, వేదాలు తెలిసినవాడు, ఎల్లప్పుడూ హృద్యమైన కార్యాలలో నిమగ్నమయ్యేవాడు, భావాతీతుడు, జగత్కారకుడు, అన్ని విద్యలకూ నిలయమైనవాడైన గణపతిని భజిద్దాం)
సదా సత్త్యయోగం ముదాక్రీడమానం
సురారీన్ హరన్తం జగత్పాలయన్తమ్
అనేకావతారం నిజాజ్ఞానహారం
పరబ్రహ్మరూపం గణేశం నమామః ॥
(సత్వగుణ శోభితుడు, స్థితికారకుడైన విష్ణు స్వరూపుడు, క్రీడాభిరాముడు, దానవాంతకుడు, జగత్తును పాలించేవాడు, అనేక అవతారాలు ఎత్తినవాడు, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు.. పరబ్రహ్మరూపుడైన గణపతికి నమస్కారాలు)
తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం
జగద్ధారకం తారకం జ్ఞానహేతుమ్
అనేకాగమైః స్వం జనం బోధయంతం
సదా సర్వరూపం గణేశం నమామః ॥
(తమోగుణ యోగాలతో లయకారకుడైన రుద్ర రూపుడు, ముక్కంటి, జగత్తును ధరించేవాడు, తరింపచేసేవాడు, జ్ఞానానికి హేతుభూతుడు, అనేక వేదశాస్త్ర విషయాలను స్వజనులకు బోధించేవాడైన గణపతికి నమస్కారాలు)
తమస్తోమహారం జనాజ్ఞానహారం
త్రయీవేదసారం పరబ్రహ్మపారమ్
మునిజ్ఞానకారం విదూరే వికారం
సదా బ్రహ్మరూపం గణేశం నమామః ॥
(చీకటి గుంపులను పోగొట్టేవాడు, భక్తజనుల అజ్ఞానాన్ని తొలగించేవాడు, వేదాల సారం తెలిసినవాడు, పరబ్రహ్మరూపుడు, మునులకు జ్ఞానం కలిగించేవాడు, వికారాలను దూరం చేసేవాడు, సాక్షాత్త్తు పరబ్రహ్మ స్వరూపుడైన గణపతికి నమస్కారాలు)
నిజైరోషధీర్తర్పయన్తం కరౌఘైః
సురౌఘాన్ కలాభిః సుధాస్రావిణీభిః
దినేశాంశు సంతాపహారం ద్విజేశం
శశాంక స్వరూపం గణేశం నమామః ॥
(కిరణజాలంతో ఓషధులను తృప్తినొందించేవాడు, సూర్యకిరణాలతో తాపాన్ని హరించేవాడు, ద్విజప్రభువు, చంద్ర స్వరూపుడైన గణపతికి నమస్కారాలు)
ప్రకాశస్వరూపం నభోవాయురూపం
వికారాది హేతుం కలాకాల భూతమ్
అనేక క్రియానేక శక్తి స్వరూపం
సదా శక్తిరూపం గణేశం నమామః ॥
(స్వప్రకాశ స్వరూపుడు, ఆకాశరూపుడు, వాయురూపుడు, జగద్వికారాలకు హేతుభూతుడు, కల, కాష్ఠ, ముహూర్తాది కాలస్వరూపుడు, క్రియాశక్తి స్వరూపుడు, చిచ్ఛక్తి స్వరూపుడైన గణపతిని నమస్కారాలు)
ప్రధానస్వరూపం మహత్తత్త్వరూపం
ధరావారిరూపం దిగీశాది రూపమ్
అసత్సత్స్వరూపం జగద్ధేతుభూతం
సదా విశ్వరూపం గణేశం నతాస్మః ॥
(ప్రధాన స్వరూపుడు, మహత్తత్త్వరూపుడు, పృథ్వీరూపుడు (భూస్వరూపుడు), జల రూపుడు, దిక్పాలకుల రూపుడు, సత్తు – అసత్తు స్వరూపుడు, జగత్కారణరూపుడు, విశ్వరూపుడైన గణపతికి నమస్కారాలు)
త్వదీయే మనఃస్థాపయే దంఫ్రిపద్మే
జనోవిఘ్నసంఘాన్నపీడాం లఖేత
లసత్సూర్యబింబేవిశాలే స్థితో యం
జనోధ్వాన్తబాధాంకథంవాలభేత ॥
(ఓ గజాననా! నీ పాదపద్మాలపై మనసు నిలిపి భజించినవారికి విఘ్నాలు, బాధలు ఉండవు. సూర్యబింబం ప్రకాశిస్తున్నప్పుడు చీకటి భయం ఉండదు కదా! )
శ్రీ గణేశ ఉవాచ :
ఇదం యః పఠేత్రాతరుత్థాయ ధీమాన్
త్రిసంధ్యం సదాభక్తియుక్తో విశుద్ధః
సపుత్రాన్ శ్రియం సర్వకామాన్ లభేత
పరబ్రహ్మరూపోభవేదంతకాలే ॥
(ఫలశ్రుతి : ప్రాతఃకాలంలో లేచి, మూడుసంధ్యలలో పరిశుద్ధ భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని పఠించేవారు సంతానాన్ని, ధనాన్ని, సర్వకామ్యాలనూ పొందుతారు. అంత్యకాలంలో బ్రహ్మ
సాయుజ్యాన్ని పొందుతారు. ఇది నా వరం)
బ్రహ్మవిష్ణు మహేశ్వరకృత గణేశ్వర స్తోత్రమ్ సమాప్తం.
“గణపతికి కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు? “
Ganesh Chaturthi 2022 | గణేశుడికి గరిక అంటే ఎందుకంత ఇష్టం?
పూరీ జగన్నాథుడిని గణపతి రూపంలో ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న కథ ఇదే..