గజ్వేల్, అక్టోబర్ 31: గజ్వేల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేది, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేది కేసీఆరే అని, అందుకు ప్రతి కార్యకర్త తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి నెల రోజులపాటు ప్రజలకు వివరించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ, నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. గజ్వేల్ పట్టణ అభివృద్ధికి బృహత్ ప్రణాళిక ఉందని, సీఎం కేసీఆర్ సహకారంతోనే గడిచిన తొమ్మిదిన్నరేండ్ల కాలంలో పట్టణ రూపురేఖలు మార్చుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని, సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పేదలను పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో పేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను తీసుకువచ్చారన్నారు. గజ్వేల్ దవాఖాన పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేనంతగా ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం జరిగిందన్నారు. మిగిలిన 5, 10 శాతం పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా కొంత మంది అర్హులు లబ్ధిపొందేవారు ఉన్నారని, చెక్కుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు, కొన్ని ప్లాట్లు కోర్టు కేసుల కారణంగా రిజిస్ట్రేషన్ కాలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని శ్మశానవాటికలకు స్థలాలు కేటాయించి పూర్తి చేస్తామన్నారు. ఇంకొంత మందికి ఇంటి స్థలాలు వచ్చేది ఉందని, వారందరి త్వరలోనే అందిస్తామన్నారు. యువతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మనందరికీ పెద్ద దిక్కుగా సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ వచ్చే పరిస్థితి లేదని, వారు ప్రజలకు చేసేదేమీ లేదని మంత్రి ఎద్దేవా చేశారు. వారిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టేనన్నారు. దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, అందులో ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చారా అని ప్రశ్నించారు. ప్రజలకు మాటలు చెప్పే వాళ్లు కాదు చేతలు చేసే వాళ్లే కావాలన్నారు. బీజేపీ రాష్ట్రంలో ఒకటి, రెండు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఝూఠా మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. గజ్వేల్ ప్రజలు సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అభ్యర్థించారు. లక్షకు పైగా మెజార్టీతో సీఎం కేసీఆర్‌ను గెలిపించుకుంటామని ముక్తకంఠంతో నాయకులు, కార్యకర్తలు చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రాధాకృష్ణశర్మ, రైతుబంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీ రవీందర్, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులున్నారు.
గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. గజ్వేల్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు అత్యధికంగా గజ్వేల్ మున్సిపాలిటీ నుంచి మెజార్టీ వచ్చేలా కృషి చేయాలన్నారు. గతంలో ఉన్న గజ్వేల్, ప్రస్తుతం కనిపిస్తున్న గజ్వేల్‌కు ఎంతో తేడా ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలతోనే ఇంతటి అభివృద్ధి జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్చార్జీ మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.
ములుగు మండలం అడవిమజీద్ గ్రామానికి చెందిన మైనార్టీలు కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా కష్టపడి పని చేయాలన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, షాదీముబారక్ పథకాన్ని అమలు చేయడంతో పేద ముస్లింలకు ఎంతో న్యాయం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యధిక మెజార్టీ వచ్చేలా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జహంగీర్, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, నాయకులు జుబేర్‌పాషా, అర్జున్‌గౌడ్, కొన్యాల బాల్‌రెడ్డి తదితరులున్నారు.